
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో దివ్యాంగులతో కలిసి సామాజిక భోజనం చేశారు. ఈ సందర్భంగా ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం, లబ్ధిదారులతో ముచ్చటించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత 21 నెలలుగా కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందని, దివ్యాంగుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం తనకు ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్‌లతో కలిసి ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందన్నారు. దివ్యాంగులు అంటే సమస్యలను అధిగమించే విభిన్న ప్రతిభావంతులని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో సుమారు 12.75 లక్షల మందికి ఈ ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

దీనివల్ల ప్రతి దివ్యాంగుడికి నెలకు రూ. 2 వేల వరకు ఆదా అవుతుందని, ఆర్థికంగా వారు నిలదొక్కుకోవడానికి ఇది దోహదపడుతుందని వివరించారు. దేశంలోనే దివ్యాంగులకు అత్యధికంగా రూ. 6 వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని, గతంలో కేవలం రూ. 500 ఉన్న పెన్షన్‌ను ఈ స్థాయికి పెంచామని గుర్తు చేశారు. అలాగే తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి రూ. 10 వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ. 15 వేలు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం పింఛన్ల కోసం ఏటా రూ. 33 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, మహిళల కోసం అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా ఇప్పటికే 52 కోట్ల ప్రయాణాలు జరిగాయని, ఇప్పుడు అదే స్ఫూర్తితో దివ్యాంగుల గౌరవాన్ని పెంచేందుకు ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. http://AMARAVATHI NEWSచివరగా, దివ్యాంగుల సమస్యలపై నిరంతరం పోరాడే మందకృష్ణ మాదిగ, గోనుగుంట్ల కోటేశ్వరరావులను అభినందిస్తూ, అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.







