
గుంటూరు, అక్టోబర్ 15:భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “అబ్దుల్ కలాం సామాన్య కుటుంబం నుంచి బయటపడి అత్యున్నత పదవిని అలంకరించిన గొప్ప వ్యక్తి. ఆయన జీవితం యువతకు మార్గదర్శకంగా నిలిచింది. శాస్త్రవేత్తగా దేశానికి చేసిన సేవలు అమోఘం. ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ఆయన జయంతిని జరపడం గర్వకారణం” అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కలాం ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు.జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, కలెక్టరేట్ ఏవో పూర్ణచంద్రరావు, సెక్షన్ సూపరింటెండెంట్లు మల్లేశ్వరి, కళ్యాణి తదితర అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.







