గుంటూరు: 06 10 25:గుంటూరు నగరంలోని ప్రధాన రహదారులు, డ్రైన్లపై ఏర్పడిన ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని లేకపోతే నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం పట్టాభిపురం మెయిన్ రోడ్, అమరావతి రోడ్, విజయపురి కాలనీ తదితర ప్రాంతాల్లో డ్రైన్లపై అక్రమ నిర్మాణాలను పరిశీలించిన ఆయన, సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో డ్రైన్లపై ఉన్న ఆక్రమణలు తొలగించడంతో వర్షపు నీరు వేగంగా బయటకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో పదేపదే సూచించినప్పటికీ, ఆక్రమణలు తొలగించని వారిపై కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
హిందూ ఫార్మసీ కాలేజీ ఎదుట ఉదాహరణ
అమరావతి రోడ్‌లోని హిందూ ఫార్మసీ కాలేజీ ఎదుట డ్రైన్‌పై ఏర్పాటైన ఆక్రమణను ఇప్పటికే మూడుసార్లు తొలగించినప్పటికీ మళ్లీ తిరిగి నిర్మించడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని సిటీ ప్లానర్‌కు ఆదేశాలు ఇచ్చారు.
వార్డు సచివాలయాల వారీగా వర్షపు నీరు కాల్వల్లోకి వెళ్లక ఇళ్లలోకి ప్రవేశిస్తున్నట్లు, రోడ్లపై నీరు నిలిచిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజల నుంచి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని కమిషనర్ తెలిపారు. అయితే, డ్రైన్లపై ఆక్రమణల తొలగింపులో పట్టణ ప్రణాళిక కార్యదర్శులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.Guntur: ఒకే ఒక్కడు…. 50 బైక్ లు ఎత్తుకెళ్లాడు
ఈ క్రమంలో 202, 137 నెంబర్ల వార్డు సచివాలయాల ప్లానింగ్ కార్యదర్శులు, 137 శానిటేషన్ కార్యదర్శి విధుల్లో లేకపోవడాన్ని గమనించిన కమిషనర్, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్‌కు సూచించారు.
ఈ పర్యటనలో పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.