గుంటూరు, సెప్టెంబర్ 16 : డీఎస్సీ నియామక పత్రాలు అందజేస్తున్న ప్రాంగణంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్అన్సారియా అధికారులను ఆదేశించారు. ఈ నెల 19వ తేదీన వెలగపూడిలో రాష్ట్ర సచివాలయం దగ్గర డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య మంత్రి పాల్గొననున్నారు. సంబంధిత ఏర్పాట్లను పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, నగర పాలక కమిషనర్ పులి శ్రీనివాసులు, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి లతో కలిసి జిల్లా కలెక్టర్ మంగళ వారం పరిశీలించారు. ప్రధాన వేదిక, పార్కింగ్ తదితర ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఎల్.ఇ.డి లను, బారికడ్లను ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు ఎక్కడా తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. జిల్లాల నుండి వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా తగు సూచన బోర్డులు ఏర్పాటు చేయాలని, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, జిల్లా విద్యా శాఖ అధికారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
209 1 minute read