విజయవాడ, గాంధీనగర్:10-10-25:-డీఎస్సీ 1998లో నియమితులైన ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతూ, అసోసియేషన్ అధ్యక్షులు బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికారిక ఉపాధ్యాయుల తరహాలోనే డీఎస్సీ 1998 టీచర్లకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, 25 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తమ సేవలను క్రమబద్ధీకరించి పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పొడిగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
“ఈనాటి వరకు ప్రభుత్వం మాకు పూర్తి స్థాయిలో గుర్తింపు ఇవ్వలేదు. మా సేవల్ని రెగ్యులరైజ్ చేసి, రిటైర్డ్ ఉపాధ్యాయులకు కనీసం రూ.20,000 పింఛన్ అందించాలి. మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులమే. మా కుటుంబాలకు న్యాయం కావాలి” అని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
రేపు గాంధీనగర్ ధర్నాచౌక్‌లో నిర్వహించే నిరసన కార్యక్రమానికి డీఎస్సీ 1998 ఉపాధ్యాయులందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించి వెంటనే పరిష్కార చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి బి.కామేష్, అప్పలనాయుడు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.