విజయవాడ, సెప్టెంబర్ 23: దుర్గమ్మ నవరాత్రుల సందర్భంగా భక్తులకు కల్పించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం పర్యవేక్షించారు. సాధారణ భక్తుడిగా క్యూలైన్లో నిల్చొని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు స్వయంగా తెలుసుకున్నారు.
క్యూలైన్లను నిశితంగా పరిశీలించిన కలెక్టర్, దర్శన సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని, ప్రతి చిన్న అంశాన్ని అధికారులు ప్రత్యేకంగా గమనించాలని ఆదేశించారు. అనంతరం, భక్తులతో కలిసి అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
తర్వాత పండిట్ నెహ్రూ బస్టాండును సందర్శించి అక్కడి ప్రయాణికులతో కలసి మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఉన్న సదుపాయాలపై పూర్తి అవగాహన పొందారు. అదేవిధంగా, సీతమ్మ వారి పాదాల వద్ద భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించి అవసరమైన సూచనలు అధికారులకు ఇచ్చారు.