
Eluru:-ఏలూరు నియోజకవర్గ ప్రజా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. మంగళవారం రాజధాని సెక్రటేరియట్‌లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిసిన చంటి, నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గంలో ఖాళీ స్థలాలపై విధిస్తున్న పన్నులు అధికంగా ఉండటంతో స్థల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే వివరించారు. ఇళ్లకు విధించే పన్నులు తక్కువగా ఉండగా, ఖాళీ స్థలాలకు అధిక పన్నులు విధించడం అన్యాయంగా మారిందని పేర్కొన్నారు. ఇళ్లకు విధించిన మాదిరిగానే ఖాళీ స్థలాలకు కూడా తక్కువ పన్నులు విధిస్తే, స్థల యజమానులు స్వచ్ఛందంగా పన్నులు చెల్లించేందుకు ముందుకు వస్తారని, తద్వారా ప్రభుత్వ రెవెన్యూ కూడా పెరుగుతుందని ముఖ్యమంత్రికి వివరించారు.Eluru News:ప్రభుత్వ విద్య పరిరక్షణకు ఏఐఎస్ఎఫ్ బస్సు యాత్ర
అలాగే ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఈడీఏ) పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈడీఏ–రెవెన్యూ శాఖల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా పార్టీ అంశాలపై కూడా చర్చ జరిగింది. ఇప్పటివరకు తాను అబ్జర్వర్‌గా బాధ్యతలు నిర్వహించిన కైకలూరు, పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టత కోసం కృషి చేశానని చంటి తెలిపారు. ఇకపై జిల్లా అధ్యక్షునిగా జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు, పార్టీపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంపొందించేలా పనిచేస్తానని భరోసా ఇచ్చారు. నాయకులందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని, తనపై ఉంచిన నమ్మకానికి పదింతలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.










