
ఏలూరు నగరంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించబడింది. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా, సంక్షేమ పథకాలను నిరాటంకంగా, సమయానికి అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు.
ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఉదయం 7 గంటల నుంచే అన్ని డివిజన్‌లలో ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఏలూరు 40వ డివిజన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు. ఆయన, ప్రతి అర్హుని ఇంటికి స్వయంగా వెళ్లి, పెన్షన్ మొత్తాన్ని అందజేసి, వారి ఆరోగ్యం, జీవనవిధానం గురించి అడిగి తెలుసుకున్నారు.
వృద్ధాప్య పెన్షన్ పొందుతూ మరణించిన వ్యక్తుల స్థానంలో వారి భార్యలకు మంజూరైన స్పౌజ్ పెన్షన్లు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెన్షన్లు మాత్రమే కాకుండా, ఇతర సంక్షేమ పథకాలు అమలవుతున్న విధానం గురించి పరిశీలించారు. ప్రజల నుండి ప్రత్యక్షంగా సమస్యలు, అభ్యర్థనలు తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ –
“2014 నుండి 2019 వరకు టిడిపి ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు నిరంతరంగా అమలయ్యాయి. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం, 2024 వరకు స్పౌజ్ పెన్షన్లను నిలిపివేసి, వేలాది కుటుంబాలను నష్టపరిచింది,” అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షలపైగా పెండింగ్ స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేయడం విశేషమని పేర్కొన్నారు.
ఏలూరు నియోజకవర్గంలో మాత్రమే 404 మందికి ఈ విధంగా ఆర్థిక లబ్ది కలిగిందన్నారు. ప్రజలు వైసిపి నాయకుల కల్లబొల్లి మాటలను నమ్మకూడదని, కూటమి ప్రభుత్వం నమ్మకంగా అండగా నిలుస్తుందని బడేటి చంటి ప్రజలకు భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఏపిఎస్ ఆర్టీసీ విజయవాడ జోన్-2 ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ – డబుల్ ఇంజన్ సర్కార్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు రికార్డు స్థాయిలో అమలవుతున్నాయన్నారు. కేంద్రం–రాష్ట్రం కలిసి సంక్షేమ పరంగా ప్రజలకు ఉచిత నమ్మకాన్ని అందిస్తున్నాయని చెప్పారు.
కార్యక్రమానికి హాజరైన వారిలో 40వ డివిజన్ ఇంచార్జి బోరా ప్రసాద్, డివిజన్ కో-ఇంచార్జి బొంతు చిన్న, డివిజన్ అధ్యక్షుడు రెడ్డి కుమార్, క్లస్టర్ ఇంచార్జి బౌరోతు బాలాజీ, ఈడా ఛైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసీ ఛైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి, కార్పొరేషన్ కమిషనర్ ఎ. భానుప్రతాప్, టిడిపి నగరాధ్యక్షులు చోడే వెంకటరత్నం, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, నాయకులు గుండాల దుర్గారావు, ఆకుల రంగారావు, శేషపు వెంకటేశ్వరరావు, చిపడ ఆనంద్, మక్కా శివ, సబ్బవరపు జానకిరామ్, చల్లా పెదబాబు తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ – ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరించాలనే నిబద్ధతతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇకపై ప్రతి ఒక్కరి ఇంటికే సంక్షేమం తలుపుతడుతుంది, కూటమి సంకల్పం ఇదేనని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమం నిండిన జనసమ్మర్దం, ప్రజల్లో పెరిగిన నమ్మకం – కూటమి పాలనపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.







