
ఏలూరు, ఫిబ్రవరి 07:– ఏలూరు రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న ఆధునీకరణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం ఆయన ఏలూరు రైల్వే స్టేషన్‌ను సందర్శించి అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్న నేపథ్యంలో, ఏలూరు రైల్వే స్టేషన్‌లో రూ.21.30 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు తనిఖీలు నిర్వహించి సూచనలు చేసినప్పటికీ, పనుల తుది దశలో కూడా నాణ్యత లోపాలు కొనసాగుతుండటంపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఫ్లోరింగ్ పనులు, వెయిటింగ్ హాళ్లు, టాయిలెట్లు సహా పలు చోట్ల నాసిరకం సామాగ్రి వినియోగం జరిగినట్లు ఎంపీ గుర్తించారు. తనిఖీ సమయంలో పనులు చేపట్టిన కాంట్రాక్టరు హాజరు కాకపోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, పనుల తీరుపై తాను గమనించిన అంశాలను ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని ఎంపీ తెలిపారు. వచ్చే నెలలో మరోసారి తనిఖీ నిర్వహించి, అప్పటికీ మార్పులు కనిపించకపోతే విజిలెన్స్ విచారణకు ఆదేశించి కాంట్రాక్టరుపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.Eluru Local News
రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. అవసరమైతే ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్తానని ఆయన తెలిపారు.










