ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం నిజాంపట్నంలోని మేకల శోభారాణి ఇంటికి జిల్లా కలెక్టర్ వెళ్లి పింఛన్ నగదు అందజేశారు.
ప్రజల కొరకు ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. సదరు లబ్ధిదారురాలైన శోభారాణితో కలెక్టర్ మాట్లాడారు. తాగునీటి కొరకు ఇబ్బందులు పడుతున్నామని ఆమె కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
అరటి బోదెలతో గృహ ఉపకారణాలు తయారు చేస్తున్న మహిళలతో కలెక్టర్ మాట్లాడారు. తుపాను షెల్టర్లులో అరటి బోదెలతో గృహ ఉపకారణాల తయారీపై శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడారు. ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో అనంతపురం నుంచి అరటి బోదెలు తెప్పించుకుని వివిధ రకాల వస్తువులను తయారుచేయడాన్ని ఆయన పరిశీలించారు. సుగంధ పరిమళాలు వెదజల్లే కొవ్వొత్తులను తయారు చేయడంలో వారి ఆసక్తిని చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ స్వయంగా రూ.500లకు కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించారు. గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ఆరా తీశారు.
వరి పంట సాగు చేసిన రైతులు ఆందోళన చెందకుండా వ్యవసాయశాఖ సిబ్బంది అవగాహన కల్పించాలని కలెక్టర్ చెప్పారు. నిజాంపట్నంలోని రైతు సేవ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులకు గోనె సంచులు, టార్పాలిన్ పట్టలను ఉచితంగా పంపిణీ చేశారు. వర్షానికి పడవకుండా ధాన్యాన్ని భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు. భారీ వర్షాల హెచ్చరికలతో అత్యవసరంగా గోదాములను గుర్తించామని రైతులకు తెలిపారు. అన్ని ప్రాంతాలలో గోదాములు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. నిజాంపట్నంలో 30 ట్రాక్టర్లను రైస్ మిల్లులకు అనుసంధానించామని, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అవసరమైన వాహనాలను రైతులు తెచ్చుకోవచ్చన్నారు. వాటికి జిపిఎస్ అమర్చాల్సి ఉందన్నారు. రైతులు వరి పంట కోసిన తర్వాత వర్షానికి తడవకుండా భద్రంగా ఉంచుకోవాలన్నారు. తదుపరి తేమ 17 శాతానికి రాగానే రైతు సేవా కేంద్రాలలో అమ్ముకోవచ్చన్నారు. ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆయన వెంట రేపల్లె ఆర్డిఓ రామలక్ష్మి, తహసిల్దార్ శ్రీనివాసులు, తదితరులు ఉన్నారు.