
ఇంకొల్లు, నవంబర్ 8 :-ఇంకొల్లు పట్టణంలో నూతనంగా నిర్మించిన ఆస్టర్ రమేష్ హాస్పిటల్‌ను శనివారం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు ఆస్పత్రి యాజమాన్యం పూర్ణకుంభ స్వాగతం పలుకుతూ వేదపండితుల ఆశీర్వచనాలతో ఆహ్వానించింది. అనంతరం ఎమ్మెల్యే ఏలూరి, హాస్పిటల్ ఎండి డాక్టర్ పోతిన రమేష్ బాబుతో కలిసి ఆస్పత్రిలో పలు విభాగాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా సభలో ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ –“గ్రామీణ ప్రజల చెంతకే కార్పొరేట్ వైద్యం చేరడం అభినందనీయం.

పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ఇంకొల్లులో బ్రాంచ్‌ను ప్రారంభించడం సంతోషకరం” అని పేర్కొన్నారు. అనేక దశాబ్దాలుగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సామాన్యులకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందిస్తూ విశ్వాసాన్ని పొందిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా హాస్పిటల్ సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.అలాగే ఆయన, ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సీఎస్ఆర్ ఫండ్ కింద ఈ ప్రాంతంలోని ప్రభుత్వ వైద్యశాలల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.

హాస్పిటల్ ఎండి డాక్టర్ పోతిన రమేష్ బాబు మాట్లాడుతూ –“ఇంకొల్లు పరిసరాల్లో క్వాలిటీ మెడికల్ సర్వీసుల కోసం ప్రజలు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఆ అవసరాన్ని తీర్చేందుకు ఆధునిక పరికరాలు, నిపుణుల వైద్య సేవలతో ఆస్పత్రిని విస్తరించాం. గ్రామీణ ప్రాంత ప్రజలకు సరసమైన ఖర్చుతో అత్యుత్తమ చికిత్స అందించడం మా లక్ష్యం” అని అన్నారు. ఎమ్మెల్యే సూచనల మేరకు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.కార్యక్రమంలో మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకట్రావు, నాయుడు హనుమంతరావు, కర్రి శ్రీనివాసరావు, బోడెంపూడి సుబ్బారావు, సాంబయ్య, అలాగే ఆస్టర్ రమేష్ హాస్పిటల్ యాజమాన్యం మమత, కార్తీక్, భరత్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.







