
తిరుపతి: డిసెంబర్ 24:-జనవరి 10, 11 తేదీలలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్–2026ను విన్నూతనంగా, ప్రజలను ఆకర్షించేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ఈ ఫెస్టివల్‌కు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.

బుధవారం సాయంత్రం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ & జూ క్యూరేటర్ సెల్వం, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, డీఆర్ఓ నరసింహులు, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, పర్యాటక శాఖ ప్రాంతీయ డైరెక్టర్ డా. రమణ ప్రసాద్, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత సంవత్సరం మూడు రోజుల పాటు నిర్వహించిన ఫెస్టివల్‌ను ఈసారి రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక ఫ్లెమింగో ఫెస్టివల్ కమిటీని ఏర్పాటు చేశామని, పులికాట్–నేలపట్టు, బీవీ పాల్యం, అటకానితిప్ప, ఇరక్కం ఐలాండ్, ఉబ్బలమడుగు, పెరియపాల్యం తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రధాన వేదిక ఏర్పాటు చేయనున్నట్లు, స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. బీవీ పాలెంలో బోటింగ్ సౌకర్యంతో పాటు లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, పర్యాటక ప్రాంతాల్లో రోడ్డు పనులు పూర్తి చేయాలని, అటకానితిప్ప వద్ద వ్యూ పాయింట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పిల్లల కోసం ప్రత్యేక స్లాట్స్ రూపొందించి ఫెస్టివల్‌ను వీక్షించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ, ఫెస్టివల్ నేపథ్యంలో అన్ని పర్యాటక కేంద్రాల్లో నోడల్ అధికారులు ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రధాన వేదిక వద్ద క్రౌడ్ మేనేజ్మెంట్పై పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, వైద్య సేవలు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.Tirupathi news
ఈ సమావేశంలో జిల్లా పర్యాటక & సాంస్కృతిక అధికారి ఎం. జనార్ధన్ రెడ్డి, ఏపీటిడీసీ ఈఈ సుబ్రమణ్యం, సంబంధిత జిల్లా అధికారులు, పర్యాటక శాఖ సిబ్బంది, ఈవెంట్ ఆర్గనైజర్లు పాల్గొన్నారు.










