
అమరావతి:01-11-25;-అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని ముత్యాలమ్మపాలెం బీచ్ వద్ద బీసీ హాస్టల్ విద్యార్థి గల్లంతు ఘటనపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.విద్యార్థి ఆచూకీ కోసం విస్తృతంగా గాలించాలని జిల్లా కలెక్టర్‌ను, డీబీసీడబ్ల్యూను ఆమె ఆదేశించారు. ఈ మేరకు శనివారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు.పరవాడ మండలం తానం బీసీ హాస్టల్‌లో ఉంటూ రావికమతం మండలంలోని తోటవానిపాలెం గ్రామానికి చెందిన సూర్రెడ్డి భానుప్రసాద్ (10వ తరగతి) శుక్రవారం సాయంత్రం తుఫాన్ సెలవుల అనంతరం హాస్టల్‌కి తిరిగి వచ్చాడు. శనివారం ఉదయం హాస్టల్‌లో ఎఫ్ఆర్ఎస్ వేసి, తన స్నేహితులు ఎం. చందు (10వ తరగతి), ఎస్. రామచంద్ర (9వ తరగతి), పూర్వ బీసీ హాస్టల్ విద్యార్థి ఎన్. సిద్ధుతో కలిసి తానం ఉన్నత పాఠశాలకు వెళ్తున్నట్టు చెప్పి బయలుదేరాడు.
అయితే వారు స్కూల్‌కు వెళ్లకుండా ముత్యాలమ్మపాలెం బీచ్‌కు వెళ్లారు. స్నానానికి దిగబోతుండగా జాలర్లు సముద్రం ఉధృతంగా ఉందని హెచ్చరించినా, ఆ నలుగురూ స్నానానికి దిగారు. భారీ అలల ఉధృతికి లోనై లోపలికి కొట్టుకుపోయారు. అప్రమత్తమైన జాలర్లు చందు, రామచంద్ర, సిద్ధూలను కాపాడగా, భానుప్రసాద్ మాత్రం గల్లంతయ్యాడు.నాలుగు కోస్ట్ గార్డ్ బృందాలు, గజ ఈతగాళ్లు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి శ్రీదేవి మంత్రి సవితకు తెలిపారు.విద్యార్థి గల్లంతు ఘటనపై మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తూ జిల్లా కలెక్టర్ విజయతో ఫోన్‌లో మాట్లాడారు. విద్యార్థి ఆచూకీ కోసం కోస్ట్ గార్డులు, గజ ఈతగాళ్ల సాయం తీసుకోవాలని, విద్యార్థి తల్లిదండ్రులకు వెంటనే సమాచారం అందించాలని ఆమె డీబీసీడబ్ల్యూవో శ్రీదేవి, బీసీ సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ చంద్రశేఖర్ రాజుకు ఆదేశాలు జారీ చేశారు.







