గణపవరంలో గంజాయి ముఠా అరెస్ట్||Ganja Gang Busted in Ganapavaram
గణపవరంలో గంజాయి ముఠా అరెస్ట్
గణపవరంలో గంజాయి ముఠా అరెస్ట్ – రూ. 2.44 లక్షల విలువైన గంజాయి, బంగారం స్వాధీనం
చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు పల్నాడు జిల్లా పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్‌లో గంజాయి అక్రమంగా అమ్ముతున్న ఏడుగురు వ్యక్తులు, అలాగే గంజాయి తాగుతున్న మరిన్ని 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుండి రూ. 2.44 లక్షల విలువైన 2.44 కిలోల గంజాయి, రూ. 3,500 నగదు, 117 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, నరసరావుపేట ఇన్‌ఛార్జ్ డీఎస్పీ హనుమంతరావు పర్యవేక్షణలో జరిగింది. చిలకలూరిపేట గ్రామీణ సీఐ బత్తిన సుబ్బానాయుడు చాకచక్యంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, గణపవరంలోని ప్రసన్న వంశీ కృష్ణ స్పిన్నింగ్ మిల్లు వద్ద అనుమానితులపై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
గంజాయి వ్యాపారం చేస్తున్నవారిలో అన్నంరాజు ఈశ్వర సాయి కుమార్, నెలపాటి ఠాగూర్, షేక్ హుస్సేన్ బాషా, షేక్ హస్సీన్ బాషా, షేక్ బాజీ, పల్లపు నాగ ఉన్నారు. వీరిలో కొందరిపై గతంలో హత్య, గంజాయి రవాణా, హత్యాయత్నం వంటి కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
అలాగే గంజాయి తాగుతున్నవారిలో కుంటాల రవి తేజ, నీలం సూర్య, పల్లపు కళ్యాణ్ కుమార్, తెప్పలి వెంకటేష్, గుద్దింటి సురేష్, సింగంశెట్టి ప్రవీణ్ కుమార్, షేక్ జాన్ భాషా, సొంటినేని పవన్ కళ్యాణ్, పులగం సాయి వెంకటేష్, నక్కల యేసు బాబు, నాగండ్ల ఆదిత్య పండు వంటి వారు ఉన్నారు.
ఈ విజయవంతమైన ఆపరేషన్‌పై పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, సీఐ బత్తిన సుబ్బానాయుడును అభినందించారు. ఆయన మాట్లాడుతూ,
“జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై నిఘా కొనసాగుతుంది. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.
పోలీసుల ఈ చర్యతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ, పోలీసులు నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.