
గన్నవరం, నవంబర్ 3:-గన్నవరం గ్రామపంచాయతీ సర్పంచ్ నిడమర్తి సౌజన్యపై వేటు పడింది. పంచాయతీ నిధుల దుర్వినియోగం జరిగినట్టు తేలడంతో జిల్లా కలెక్టర్ బాలాజీ ఆమెను సర్పంచ్ పదవి నుండి తొలగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.జిల్లా పంచాయతీ అధికారి సమర్పించిన నివేదిక ప్రకారం గ్రామపంచాయతీ సాధారణ నిధులు, 14వ మరియు 15వ ఆర్థిక సంఘం నిధులలో మొత్తం రూ.1.32 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు అధికారులు గుర్తించారు. సర్పంచ్ నిడమర్తి సౌజన్య గ్రామ కార్యదర్శితో కలిసి ఈ నిధులను అనధికారికంగా వినియోగించినట్టు విచారణలో తేలింది.
పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఇద్దరిపై సమానంగా రూ.66,05,425 చొప్పున వసూలు చేయాలని గతంలో కలెక్టర్ నోటీసు ఇచ్చారు. ఆ మొత్తాన్ని చెల్లించేందుకు ఆరు నెలల గడువు ఇచ్చి, ఆ కాలంలో సర్పంచ్ చెక్కు డ్రాయింగ్ అధికారాలను నిలిపివేశారు.ఈ వ్యవహారంపై సర్పంచ్ నిడమర్తి సౌజన్య కలెక్టర్ ఎదుట వ్యక్తిగతంగా హాజరై జూలై 19, 2024న లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు గుడివాడ డిఎల్పిఓ సమగ్ర విచారణ జరిపి నివేదికను సమర్పించారు. నివేదికలో సర్పంచ్‌పై ఆరోపణలు నిజమని తేలడంతో, మరిన్ని అవకాశాలు ఇచ్చినా కూడా నిధులు తిరిగి చెల్లించకపోవడంతో చివరికి కలెక్టర్ సౌజన్యను పదవి నుండి తొలగించారు.ఇకపై గ్రామపంచాయతీ వ్యవహారాల నిర్వహణ బాధ్యతలను తాత్కాలికంగా ఉపసర్పంచ్‌కు అప్పగించారు.







