
గుంటూరు, అక్టోబరు 11:-గుంటూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జిజిహెచ్)ను శనివారం జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను ఆమె స్వయంగా పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
వైద్య సదుపాయాలను సమీక్షించిన కలెక్టర్, బీసీ వసతి గృహం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కూడా కలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి పర్యవేక్షకులు రమణ ఆమెకు తెలిపారు. అత్యవసర చికిత్సల కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ తక్షణ వైద్య సేవలు అందించాల్సిందిగా వైద్య సిబ్బందికి కలెక్టర్ ఆదేశించారు.
ఆసుపత్రిలో అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించిన ఆమె, మరమ్మతుకు గురైన పరికరాలను తిరిగి ఉపయోగంలోకి తేవాలన్నారు.
ఇదిలా ఉంటే, జిల్లా సాంఘిక మరియు బీసీ సంక్షేమ అధికారి చెన్నయ్య మాట్లాడుతూ, అనపర్రు వసతి గృహంలో విద్యార్థులందరూ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. జిల్లాలోని మొత్తం 33 వసతి గృహాల్లో 24 వసతిగృహాల్లో ఇప్పటికే నీటి నమూనాల పరీక్షలు పూర్తయ్యాయని, మిగిలిన వసతిగృహాల్లో కూడా త్వరితగతిన పరీక్షలు పూర్తి చేస్తామని చెప్పారు.
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని వసతి గృహాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరిచే ప్రక్రియ పూర్తయిందని వివరించారు.
ఈ సందర్బంగా జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్‌తో పాటు ఇతర అధికారులు అనపర్రు గ్రామంలో పర్యటించి పారిశుధ్య పరిస్థితులు, తాగునీటి వనరులను పరిశీలించారు.






