గుంటూరు, అక్టోబర్ 7: రామాయణ మహాకావ్యం ద్వారా మానవ సంబంధాలు, నైతిక విలువలు, కుటుంబ బాంధవ్యాలు, ఆదర్శ ప్రజాపాలన తదితర అంశాలను సమాజానికి అందించిన మహాకవి మహర్షి వాల్మీకి అని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కే. ఖాజావలి, వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘాల నాయకులు వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, మహర్షి వాల్మీకి రామాయణం ద్వారా చూపించిన విలువలు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, ప్రజా జీవితాల్లో పాటించాల్సినవేనని అన్నారు. వాటిని ఆచరణలో పెట్టడం ద్వారానే వాల్మీకికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ దిశానిర్దేశం అందించారని కలెక్టర్ గుర్తు చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోందని వివరించారు. ప్రజల సూచనల ఆధారంగా సంక్షేమ పథకాలను మరింత మెరుగుపరిచి అర్హులైన లబ్ధిదారులకు అందించేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
వేడుకల్లో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ వై. లక్ష్మీ శైలజ గౌడ్, విశ్వబ్రాహ్మణ సాధికారిక కమిటీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు జంపని నాగేశ్వరరావు, టిడిపి బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వేములకొండ శ్రీనివాసులు, ఏఎన్‌యూ రిటైర్డ్ లైబ్రరీయన్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.
మహర్షి వాల్మీకి సాధారణ బోయ కుటుంబానికి చెందిన వారు కావడమే కాక, తపోనిష్ఠతో మహర్షిగా మారి రామాయణాన్ని రచించడం గొప్ప ఉదాహరణగా నిలుస్తుందన్నారు. రామాయణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచి సమాజ అభ్యుదయానికి దోహదం చేయాలని నేతలు సూచించారు.
కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి మయూరి, రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ రాచకొండ నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, ఉద్యోగులు, వివిధ సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.