
గుంటూరు, అక్టోబర్ 31:– జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నగరపాలక సంస్థ, రహదారులు-భవనాల శాఖ, పంచాయతీరాజ్, సంక్షేమ శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శంకర్ విలాస్ ఆర్వోబి, మానస సరోవరం పార్క్, గోరంట్ల తాగునీటి పథకం, నార్ల ఆడిటోరియం, నల్లపాడు చెరువు, అంబేద్కర్ భవన్, పి.వి.కే. నాయుడు మార్కెట్, భూగర్భ డ్రైనేజీ సిస్టమ్, ఇన్నర్ రింగ్ రోడ్ మూడవ దశ, సంక్షేమ వసతి గృహాల నవీకరణ వంటి కీలక ప్రాజెక్టులను సమీక్షించారు.ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాల నవీకరణకు సంబంధించిన అంచనాలను తక్షణమే సిద్ధం చేయాలని సూచించారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయడం ద్వారా జిల్లా రూపురేఖలు మరింత మెరుగుపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు.
నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ, మానస సరోవరం అభివృద్ధి కోసం డీపీఆర్ సిద్ధం చేయుటకు టిడ్కోను కన్సల్టెంట్‌గా నియమించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. గోరంట్ల నీటి పథకంలో 90 శాతం పనులు పూర్తయినట్లు తెలిపారు. నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియంను సాంస్కృతిక మరియు బహుళ కార్యక్రమాల కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.నల్లపాడు చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించేందుకు కూడా టిడ్కోను కన్సల్టెంట్‌గా నియమించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. పి.వి.కే. నాయుడు మార్కెట్‌ను 1.92 ఎకరాల్లో ఎనిమిది అంతస్తులతో ఆధునిక సదుపాయాలతో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కోసం రూ.600 కోట్ల ప్రాజెక్ట్ ప్రతిపాదించామని, ఇందులో సిఆర్డిఏ రూ.150 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపారు.రహదారులు భవనాల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాసమూర్తి తమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల వివరాలను సమర్పించారు. సమావేశంలో నగరపాలక సంస్థ పర్యవేక్షక ఇంజనీర్ సుందర రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.







