
బాపట్ల:డిసెంబర్ 24:-జిల్లాలో వివిధ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.వినోద్ కుమార్, ఐఏఎస్ అధికారులను ఆదేశించారు.
బుధవారం స్థానిక జిల్లా కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి నేషనల్ హైవే, ఆర్‌అండ్‌బి, రైల్వే, పర్యాటక, మత్స్య, విద్య, వైద్య శాఖలకు సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రవాణా సౌకర్యాలు మెరుగుపడితే అభివృద్ధి వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా జాతీయ రహదారుల నిర్మాణాలతో ప్రజల ప్రయాణాలు సులభతరం అవుతాయన్నారు. వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి (ఎన్‌హెచ్-167ఏ) పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గుంటూరు–నిజాంపట్నం రహదారి నిర్మాణం, నిడుబ్రోలు–చందోలు ఆర్‌అండ్‌బి రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. కర్లపాలెం–గణపవరం రహదారి పనులపై ప్రతి వారం పురోగతి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.Bapatla Local News
పర్యాటక రంగానికి సంబంధించి స్వదేశీ దర్శన్ పథకం కింద మంజూరైన ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలన్నారు. సూర్యలంక బీచ్‌లో జరుగుతున్న నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని, బోటింగ్ కోసం కెనాల్ చుట్టూ చెట్ల తొలగింపు పనులు పూర్తిచేయాలని సూచించారు. పర్యాటకులకు వాహన పార్కింగ్ సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. హరిత రిసార్ట్స్ భవనాన్ని ఆధునికీకరించే పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించారు.
వైద్య రంగంలో భాగంగా చీరాల ఏరియా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌ను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆర్టిజన్ సెంటర్, భవిత సెంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని అధికారులకు తెలిపారు. పిల్లల సంక్షేమానికి అనుగుణంగా నిబంధనలను అవసరమైతే సవరించుకోవాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తూ లక్ష్య సాధన దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.










