బాపట్ల10-10-2025:-బాపట్ల జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై దిశ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం శుక్రవారం బాపట్ల కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సమావేశానికి దిశ కమిటీ ఛైర్మన్, బాపట్ల ఎంపీ, పార్లమెంటు పానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పేదరిక నిర్మూలన, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యత” అని తెలిపారు. జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, కేంద్ర నిధులతో నడుస్తున్న పథకాల అమలు నిర్ధిష్ట లక్ష్యాలతో సాగాలని సూచించారు.
“పి4 విధానం” బాపట్ల నుంచే మొదలైందని గుర్తు చేసిన ఎంపీ, ఇది దేశవ్యాప్తంగా ఆదర్శంగా మారిందన్నారు. ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు, నాణ్యమైన వైద్యం, విద్య, యువతకు నైపుణ్య శిక్షణలు ప్రాధాన్యమివ్వాలన్నారు.
జిల్లాలో సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97 కోట్లు, నిజాంపట్నంలో ఆక్వా పార్క్ నిర్మాణానికి రూ.88.43 కోట్లు కేటాయించారని తెలిపారు. అలాగే జలజీవన్ మిషన్ కింద రూ.167.48 కోట్లతో 403 పనులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇప్పటివరకు రూ.19.21 కోట్లతో మంజూరైన 64 పనులు ప్రారంభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఉపాధి కల్పనపై దృష్టి
జిల్లాలో లక్ష మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తూ ఉపాధి కల్పించడమే లక్ష్యమని ఎంపీ స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం, పక్కా గృహాల నిర్మాణాలు, నాటుకున్న మొక్కల పరిరక్షణ వంటి అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.
“ప్రధాని అవాస్ యోజన” ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల నిర్మాణానికి అదనపు ఆర్థిక సహాయం అందించాలన్నారు. పింఛన్ పంపిణీలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందన్నారు.
అభివృద్ధి లక్ష్యం – సహకారం అవసరం
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ మాట్లాడుతూ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తే బాపట్లను రాష్ట్రంలో మూడో స్థానంలో నిలపడం సాధ్యమని చెప్పారు. ప్రజలకు అనుభవించే విధంగా పథకాల అమలు జరగాలని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రూపొందించాలన్నారు.
ప్రత్యేకంగా మంతడాల ప్రాధాన్యత పెంచాలని, మొక్కల నాటింపు, పంట గట్లపై ఉద్యాన పంటల సాగుకు రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని Collector తెలిపారు.
ఈ సమావేశంలో ఇంచార్జి సంయుక్త కలెక్టర్, డీఆర్ఓ జి. గంగాధర్ గౌడ్, ప్రకాశం జడ్పీ సీఈవో చిరంజీవి, గుంటూరు జడ్పీ సీఈవో జ్యోతి బస్సు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.