
హైదరాబాద్:10-10-25:- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, బీసీ సంఘాలు, నేతలు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. అక్టోబర్ 14న శాంతియుతంగా బంద్ నిర్వహించాలని వారు ప్రకటించారు.
బీసీల రాజకీయ హక్కులు, ఆత్మగౌరవం కోసం ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు కుల, ఉద్యోగ, మహిళా సంఘాల నేతలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, ‘‘బీసీల ఉద్యమానికి ఇది ఒక మలుపు. ఇప్పుడు స్వార్థ ప్రయోజనాలకు తావులేకుండా ఐక్యంగా ముందుకు వెళ్లాలి. మిలియన్ మార్చ్ తరహాలో ఈ నెల 14న బంద్‌ను నిర్వహిస్తాం. దేశాన్ని కదిలించేలా ధర్నాలు, రాస్తారోకాలు జరుగుతాయి. బీసీల శక్తిని ప్రజలకు చూపించే రోజు అది,’’ అన్నారు.
ఈ బంద్‌కు ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు అన్ని వర్గాల ప్రజా ప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పల్లె రవికుమార్, చెరుకు సుధాకర్, రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.







