గూగుల్ భారతీయ విద్యార్థులకు ₹19,500 విలువైన జెమిని AI ప్రో ఫ్రీగా అందిస్తోంది||Google Gifts Indian Students ₹19,500 Worth Gemini AI Pro for Free
గూగుల్ భారతీయ విద్యార్థులకు ₹19,500 విలువైన జెమిని AI ప్రో ఫ్రీగా అందిస్తోంది
గూగుల్ భారతీయ విద్యార్థులకు ఓ విశేషమైన బహుమతి అందించేందుకు ముందుకొచ్చింది. “జెమిని AI ప్రో ప్లాన్”ను పూర్తి ఏడాది పాటు ఉచితంగా అందించబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ప్లాన్ విలువ సుమారు రూ.19,500గా ఉండగా, ఇది విద్యార్థులకు అత్యాధునిక ఏఐ టూల్స్ నేర్చుకోవడంలో ఎంతగానో ఉపయుక్తంగా మారనుంది. ముఖ్యంగా కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకునే వీలుంది.
ఈ ప్లాన్ ద్వారా విద్యార్థులకు జెమిని 2.5 ప్రో లాంటి అభివృద్ధి చెందిన ఏఐ మోడల్, ప్రాజెక్ట్‌లపై డీప్ రీసెర్చ్ చేయగలిగే సామర్థ్యం, మరియు హోంవర్క్‌కు సహాయపడే నోట్బుక్ LM వంటి టూల్స్ లభించనున్నాయి. అంతేకాకుండా, రియల్ టైమ్ లో ప్రాజెక్ట్ చర్చలకు ఉపయోగపడే జెమిని లైవ్ సౌకర్యం, ఫొటోలు లేదా టెక్స్ట్ ఆధారంగా వీడియోలు తయారు చేయగల Veo వంటి ఫీచర్లు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. విద్యార్థులు క్లాస్‌నోట్స్, అసైన్‌మెంట్లు, ప్రెజెంటేషన్‌లు రూపొందించడానికి అవసరమైన గూగుల్ డాక్స్, షీట్స్, స్లైడ్స్ వంటి అప్లికేషన్లలో కూడా జెమిని AI సహకారం పొందవచ్చు.
ఈ ప్లాన్‌ను పొందాలంటే విద్యార్థులు 18 ఏళ్లు మించి ఉండాలి. భారతదేశంలో నివసిస్తూ, గుర్తింపు పొందిన కళాశాలలో విద్యనభ్యసిస్తూ ఉండాలి. విద్యార్థిత్వాన్ని ధృవీకరించడానికి SheerID ద్వారా వెరిఫికేషన్ జరుపుకోవాలి. ఈ ప్రక్రియ సాధారణంగా 30 నిమిషాల్లో పూర్తవుతుంది. విద్యార్థులు సెప్టెంబర్ 15, 2025లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జెమిని ప్రో ట్రయల్ కోసం పేమెంట్ మేథడ్ జతచేయాల్సి ఉన్నా, విద్యార్థులకు ఏ రకం ఖర్చూ ఉండదు — మొత్తం సంవత్సరం పాటు పూర్తిగా ఉచితమే.
గూగుల్—Kantar నివేదిక ప్రకారం, ఇప్పటికే జెమినిని ఉపయోగిస్తున్న విద్యార్థుల్లో 95 శాతం మంది తమ నైపుణ్యాలపై మరింత విశ్వాసాన్ని పొందారని తెలిపారు. గూగుల్, భారత విద్యార్థుల భవిష్యత్తు విజయానికి AI ఆధారిత పరిజ్ఞానం కీలకమని నమ్ముతుంది. అందుకే వారికోసం ఈ ఉచిత ప్రీమియం సదుపాయాన్ని అందిస్తూ వారి సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
విద్యార్థులు వెబ్‌సైట్‌ను సందర్శించి, తగిన వివరాలు అందించి ఈ అవకాశం పొందవచ్చు. దీని ద్వారా విద్యాభ్యాసాన్ని మరింత సృజనాత్మకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దుకునే అవకాశాన్ని గూగుల్ అందిస్తోంది.