
హైదరాబాద్: మహరాజ్‌గంజ్:30-11-25:-ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆనందం పంచాలని లక్ష్యంగా పెట్టుకున్న బేగంబజార్ కార్పొరేటర్, జీహెచ్ఎంసి బీజేపీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ప్రతి ఏటా సొంత ఖర్చులతో విహారయాత్రలకు విద్యార్థులను తీసుకెళ్తూ స్థానికుల మన్ననలు పొందుతున్న ఆయన, ఈసారి మహరాజ్‌గంజ్‌లోని శ్రీ సావిత్రి కన్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను భద్రాచలం యాత్రకు పంపించారు.

ఈ సందర్బంగా ప్రత్యేక బస్సులో 50 మంది విద్యార్థులు, వారి ఉపాధ్యాయులతో కలిసి భద్రాచలం శ్రీ సీతారాముల వారి దర్శనం చేశారు. బేగంబజార్ ప్రాంతాల్లో హామాలీ, కూలీ పనులు చేస్తూ జీవిస్తున్న కుటుంబాల పిల్లలు ఈ పాఠశాలలో చదువుతున్నారని, వారి కోరిక మేరకు గత ఐదేళ్లుగా వారు కోరిన ప్రదేశాలకు విహారయాత్రలు ఏర్పాటు చేస్తున్నట్లు శంకర్ యాదవ్ తెలిపారు.

ఇక విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యమని పేర్కొంటూ, ప్రస్తుతం తెలుగు మీడియంలో బోధన జరుగుతున్న ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తరగతులు కూడా ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులను కోరినట్లు ఆయన తెలిపారు. Shankar Yadav చేసిన ఈ సేవా కార్యక్రమంపై తల్లిదండ్రులు, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.







