
డిజిటల్ చెల్లింపులు, ముఖ్యంగా UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా జరిగే లావాదేవీలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగాయి. వినియోగదారులకే కాకుండా చిన్న వ్యాపారులు, పంట విక్రేతలు, నగదు లేనిదే చెల్లింపులను చేయాలనుకునే ప్రతి ఒక్కరూ UPI పద్దతిని ఉపయోగిస్తున్నారు. అయితే ఇటీవల కొన్ని మీడియా నివేదికల ద్వారా ప్రజల్లో ఒక సందేహం నెలకొంది – ₹2,000కు మించి జరిగే UPI లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం GST వసూలు చేయబోతుందా?
ఈ పుకార్లకు ముగింపు పలకుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది. ₹2,000పైగా జరిగే UPI లావాదేవీలపై GST వసూలు చేయడం గురించి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయడం లేదని స్పష్టం చేసింది. పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇచ్చిన ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ప్రభుత్వం తరఫున విడుదలైన ప్రకటనలో, “ఇలాంటి వార్తలు నిరాధారమైనవి. ప్రస్తుతానికి ఎలాంటి కొత్త పన్ను లేదా ఛార్జీలను విధించే యోచన లేదు” అని పేర్కొంది.
ప్రస్తుతం ప్రజల భాద్యతగా ఉన్న డిజిటల్ చెల్లింపులకు ఊతమిచ్చే విధంగా UPI చెల్లింపులకు ప్రోత్సాహక పథకాలు అమలులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ‘UPI ఇన్సెంటివ్ స్కీమ్’ అమలులో ఉండగా, 2023–24లో దాదాపు ₹3,600 కోట్లకు పైగా ప్రోత్సాహకంగా చెల్లించిందని తెలిపింది.
ఈ స్పష్టతతో, ప్రజల్లోని అనేక భయాలు నివృత్తి అయ్యాయి. డిజిటల్ చెల్లింపులను మరింతగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని, ప్రజలపై అదనపు భారం వేసే ఆలోచన ఎప్పటికీ లేదని స్పష్టం చేసింది. చిన్న చిన్న కొనుగోళ్ల నుంచి, పెద్ద మొత్తాల వరకు, వినియోగదారులు నిర్భయంగా UPI ద్వారా లావాదేవీలు కొనసాగించవచ్చని ప్రభుత్వం తెలిపింది.







