
కృష్ణా:పెడన: అక్టోబర్ 16:-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘జిఎస్టి 2.0 సూపర్ సిక్స్ – సూపర్ సేవింగ్’ కార్యక్రమంలో భాగంగా, పెడన పట్టణంలో రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక స్మాల్ వెహికల్ ర్యాలీ నిర్వహించారు. పెడన పురపాలక సంఘం కార్యాలయం నుంచి బంగ్లా స్కూల్ వరకు ఈ ర్యాలీ సాగింది.
ఈ కార్యక్రమంలో వాసవి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు, ఆటో యూనియన్ నాయకులు, స్థానిక ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. స్ధానికంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించి, జీఎస్టీ 2.0 పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వాహన తనిఖీ అధికారి మహమ్మద్ ఎల్. సిద్ధిక్, జీఎస్టీ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ శ్రిమతి అత్తిలి రంగమణి, పెడన మున్సిపల్ కమిషనర్ ఎల్. చంద్రశేఖర్ రెడ్డి, ట్రైనీ ఎస్సై నాగరాజు పాల్గొన్నారు.జీఎస్టీ 2.0లో కీలకంగా ఉన్న 18 శాతం మరియు 5 శాతం అనే రెండు స్లాబుల విషయాన్ని ప్రజలకు వివరించారు. కొత్త సంస్కరణలతో జీఎస్టీ మరింత సులభతరం అవుతుందనీ, ప్రతి పౌరుడు అవగాహన పెంచుకోవాలన్నదే కార్యక్రమం ఉద్దేశమని జీఎస్టీ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ శ్రిమతి రంగమణి తెలిపారు.సూపర్ సిక్స్ సూపర్ సేవింగ్స్ లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ప్రజల్లో మంచి స్పందనను రాబడుతున్నాయని అధికారులు తెలిపారు.







