
గుంటూరు, అక్టోబర్ 13:గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం నిర్వహించిన “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి, పలు నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గింపు వల్ల ఏర్పడిన ధరల తేడాను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే గల్లా మాధవి, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ 2.0 పన్ను సంస్కరణలు పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.“ఇప్పటి వరకూ నాలుగు స్లాబ్‌లలో (5%, 12%, 18%, 28%) అమలులో ఉన్న జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేవలం రెండు స్లాబ్‌లకే పరిమితం చేసింది. అందులో 99 శాతం నిత్యవసర వస్తువులు 5 శాతం స్లాబ్‌లోకి రావడంతో ప్రజలకు నేరుగా ధరల తగ్గింపు లభిస్తోంది,” అని తెలిపారు.
అంతేకాకుండా, ఆరోగ్య బీమాపై పన్నును పూర్తిగా తొలగించడం వల్ల వైద్య ఖర్చులు తగ్గి సామాన్యులకు మేలు జరుగుతోందన్నారు. ఇది నిజమైన ప్రజానుకూల నిర్ణయమని ఆమె అభిప్రాయపడ్డారు.“వినియోగదారులు పాత ధరలు కాకుండా తాజా జీఎస్టీ రేట్ల ప్రకారం వస్తువులు కొనుగోలు చేస్తున్నారా అన్నది ప్రతి ఒక్కరూ తన స్థాయిలో చూసుకోవాలి. అవగాహన కలిగిన వినియోగదారుడే బలమైన ఆర్థిక వ్యవస్థకు పునాదిగా నిలుస్తాడు,” అని గల్లా మాధవి సూచించారు.కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న ఈ సంస్కరణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, ప్రతి కుటుంబం ఆర్థికంగా లాభపడేలా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
 
  
 






