గుంటూరు:08-10-25:గుంటూరు నగర రాకపోకలకు ప్రధాన ధమని వంటి జీటీ రోడ్ పునర్నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టాలంటూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి కలెక్టర్ శ్రీమతి తమిమా అన్సారియాను కోరారు. బుధవారం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె, నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్ర చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ, “గుంటూరు మార్కెట్ సెంటర్ నుంచి చుట్టుగుంట సెంటర్ వరకు సాగిన జీటీ రోడ్ నగర రవాణాకు కీలకం. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రహదారి తీవ్రంగా దెబ్బతింది. దాంతో వాహనదారులు ప్రతిరోజూ భారీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ రహదారి పునర్నిర్మాణం అత్యవసరం” అని పేర్కొన్నారు.
రహదారి అభివృద్ధి కోసం ఆర్ అండ్ బి శాఖతో సమన్వయం చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్యే, ప్రజలకు సౌకర్యం కల్పించడమే తన ప్రాధాన్యం అని చెప్పారు. నగర అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు.