
కృష్ణా జిల్లా : గుడివాడ:-30-11-25;ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) & ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో సైక్లోథాన్–2025 సైకిల్ ర్యాలీ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు వెనిగండ్ల రాము దంపతులు, ఈగల్ టీం ఐ.జి. కృష్ణ, జిల్లా ఎస్‌పీ విద్యాసాగర్ నాయుడు, ఐఎంఏ అధ్యక్షులు మాగంటి శ్రీనివాస్ హాజరయ్యారు. పావురాలను ఎగురవేసి ర్యాలీని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం నేతలు సైతం సైకిల్ తొక్కుతూ ర్యాలీలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ—“ఆంధ్రప్రదేశ్‌లో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అంటూ యువతలో అవగాహన పెంచేందుకు ఈ ర్యాలీ నిర్వహించాం. డ్రగ్స్ వ్యసనంతో చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మంచి–చెడు అలవాట్లను గుర్తించి, మంచి మార్గంలో నడిచి ఉన్నత స్థాయికి చేరుకోవాలి” అని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మాలంటే భయపడే పరిస్థితులు సృష్టించామని, డ్రగ్స్‌కు సంబంధించిన ఏ సమాచారం ఉన్నా ప్రభుత్వ టోల్ ఫ్రీ 1972 నంబర్‌కు వెంటనే తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.







