
కృష్ణా:గుడివాడ:29-10-25:-కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించారు. మోటూరు, లింగవరం తదితర గ్రామాల్లో బుధవారం అధికారులు పర్యటించి పంటల నష్టాన్ని అంచనా వేశారు.

ఈ సందర్భంగా గుడివాడ వ్యవసాయ అధికారి కవిత మాట్లాడుతూ – “తుఫాన్ కారణంగా వరి పంటలు తీవ్రమైన నష్టాన్ని చవిచూశాయి. ప్రస్తుతానికి పంట పాలుపోసే దశ నుంచి గింజ కట్టే దశలో ఉన్నాయి. నష్టాన్ని అంచనా వేయడం కొంత సమయం పడుతుంది. రైతులు పడిపోయిన పైరును నిలబెట్టి, పొలాల్లో నిల్వ ఉన్న నీటిని సాధ్యమైనంతవరకు బయటకు త్రోయాలి. కంకికి గాలి తగిలేలా పైకిలేపి కట్టుకోవడం వల్ల పంట పునరుద్ధరణకు అవకాశం ఉంటుంది” అని సూచించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ అసిస్టెంట్ అధికారి పి. అనంతలక్ష్మి, శాఖ సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.







