
గుడివాడ, జనవరి 19:-కృష్ణాజిల్లా గుడివాడలో జరుగుతున్న 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14 గర్ల్స్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ జిల్లా ప్రజలకు గర్వకారణమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. జాతీయ స్థాయి క్రీడా పోటీలకు గుడివాడ వేదిక కావడం ద్వారా జిల్లాకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించిందన్నారు.

సీఎం నారా చంద్రబాబు నాయుడు, యువత-విద్య-క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న నారా లోకేష్ ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో క్రీడలకు మరింత బలం చేకూరుతోందని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పబ్జీ ఆడుకోవడమే సరిపోయిందని, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే క్రీడల బదులు క్యాసినోలను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన బాలికా క్రీడాకారిణులకు మంత్రి హృదయపూర్వక స్వాగతం పలికారు. చిన్న వయసులోనే కబడ్డీ వంటి సంప్రదాయ భారతీయ క్రీడలో బాలికలు రాణించడం మహిళా శక్తికి నిదర్శనమని అన్నారు. ఈ పోటీలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు భావనను పెంపొందిస్తాయని తెలిపారు.

School Games Federation of India ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఛాంపియన్‌షిప్ దేశ క్రీడా భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తుందని, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన బాలికలకు ఇలాంటి అవకాశాలు వారి జీవిత దిశను మార్చగలవని మంత్రి చెప్పారు. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

బాలికల క్రీడా అభివృద్ధికి శిక్షణ, భద్రత, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ఈ పోటీల ద్వారా భవిష్యత్ జాతీయ-అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు రూపుదిద్దుకుంటారన్న నమ్మకం వ్యక్తం చేశారు.Gudivada lo 15 na JOB Mela
ఈ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు, కోచ్‌లు, నిర్వాహకులను మంత్రి అభినందించారు. గెలుపు-ఓటమి కంటే పాల్గొనడం ముఖ్యమని, ప్రతి క్రీడాకారిణి ఈ వేదికలో విజేతేనని తెలిపారు. గుడివాడలో జాతీయ స్థాయి క్రీడా సంబరం జరగడం మనందరి సమిష్టి విజయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, షాప్ చైర్మన్ రవి నాయుడు, సెక్రటరీ భాను ప్రకాష్, గిడ్డంగుల చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇంచార్జి చురగడ్డ శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాస్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చ. రవి, గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి తదితరులు పాల్గొన్నారు.










