
చిలకులూరిపేట:09-11-25:-పట్టణంలోని పాత నేషనల్ హైవేతో పాటు వివిధ రహదారులపై ఏర్పడిన గుంతలు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయని, వెంటనే మరమ్మత్తు చర్యలు చేపట్టాలని సామాజికవేత్త మాదాసు భాను ప్రసాద్ డిమాండ్ చేశారు.ఈరోజు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “గతంలో తెలంగాణలో చేవెళ్ల వద్ద నాలుగు అడుగుల గుంత కారణంగా కంకర టిప్పర్, ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై 19 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరిచిపోరాదు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పట్టణంలో గుంతలు పడిన రోడ్లను తక్షణమే మరమ్మత్తు చేయాలి” అని అన్నారు.
వాడరేవు–నకరికల్లు హైవేలో పసుమర్రు, ఇంజనంపాడు ప్రాంతాల వద్ద ఉన్న డిజైన్ లోపాన్ని వెంటనే సరిచేసి, అవసరమైన చోట అండర్‌పాసులు నిర్మించాల్సిందిగా ఆయన అధికారులను కోరారు.మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని, కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు దహన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన అందరికీ హెచ్చరిక కావాలని ఆయన పేర్కొన్నారు.అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్‌లను అరికట్టేందుకు వివిధ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.“కొంతమంది ఆకతాయిలు రాత్రివేళల్లో నేషనల్ హైవేపై రైడింగ్ పోటీలు నిర్వహిస్తున్నారంటే వారి బరితెగింపు ఎటువంటి స్థాయిలో ఉందో అధికారులు ఆలోచించాలి. నెంబర్‌ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల సమయంలో బాధితులు ఫిర్యాదు చేయడమే కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందో అధికారులే సమాధానం చెప్పాలి,” అని మాదాసు భాను ప్రసాద్ ప్రశ్నించారు.







