
స్వచ్ఛ వాయు సర్వేక్షన్లో గుంటూరు నగరానికి జాతీయస్థాయిలో 6వ ర్యాంక్ దక్కింది. దక్షిణ భారతదేశంలో ఒక్క గుంటూరు నగరానికే ఈ గుర్తింపు లభించింది. పచ్చదనం పెంపు ప్రధాన రహదారుల పరిశుభ్రతతో జాతీయస్థాయి గుర్తింపు లభించిందని మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమీషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో అభివృద్ధి పథంలో నగరాన్ని నిలుపుతామని చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్.క్యాప్) చేపట్టిన స్వచ్చ వాయు సర్వేక్షణ్ లో గుంటూరు నగరానికి జాతీయ స్థాయిలో 6వ ర్యాంక్ దక్కింది, దక్షిణ భారతదేశంలో కేవలం గుంటూరు నగరానికే ఈ అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మాట్లాడుతూ కేంద్ర ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ మరియు క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్.క్యాప్) చేపట్టిన స్వచ్చ వాయు సర్వేక్షణ్ పోటీల్లో జాతీయ స్థాయిలో 130 నగరాలు పోటీ పడ్డాయని, అందులో 10 లక్షలలోపు జనాభా కేటగిరిలో గుంటూరు నగరానికి 6 వ ర్యాంక్ దక్కిందన్నారు. దక్షిణ భారతదేశంలో ఈ అవార్డ్ ఒక్క గుంటూరు నగరానికే దక్కడం గర్వకారణమన్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి 130 నగరాల్లో స్వచ్చ వాయు సర్వేక్షణ్ అంశాల్లో పరిశీలించి, 2024-25 ఆర్ధిక ఏడాదికి ఉత్తమ నగరాలను సిఫార్స్ చేసిందన్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభించుట జరిగిందని దాని వలన 6వ ర్యాంకుకు పరిమితం కావలసి వచ్చిందని, లేనిచో మరింత మంచి ర్యాంకు సాధించే వారమని తెలియజేశారు. ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షన్ లో జాతీయస్థాయిలో సూపర్ సిటీగా అవార్డు సాధించడమైనదని వారు వెల్లడించారు. గుంటూరు నగరానికి జాతీయ స్థాయిలో ర్యాంక్ రావడంలో నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల కృషి ఉందని, ఈ అవార్డ్ ద్వారా జాతీయ స్థాయిలో గుంటూరు ఖ్యాతి చాటడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి నగరపాలక సంస్థ తరుపున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు.








