లిక్కర్ డాన్ల పర్యవేక్షణలో వైసీపీ పని చేస్తోందని, గత ఐదేళ్ల పాలనంతా అవినీతి మాఫియా నడిచిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ విమర్శించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రూ.1.47 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్థానిక రాఘవనగర్ 1వ లైను, ఆర్టీసీ కాలనీ వద్ద రూ.27.48 లక్షలు, రాఘవనగర్ లో రూ.32.16 లక్షలు, రైలు పేట రూ.19.04 లక్షలు, అంజుమన్ స్కూల్ వెనుక వైపు రూ.29.27 లక్షలు, లాంచెస్టర్ రోడ్లు రూ.40 లక్షలతో సీసీ డ్రెయిన్లు, సీసీ రోడ్లు, పైపు లైన్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టారు. వీటికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అరాచకం, అవినీతి మినహా రాష్ట్రానికి ఏమీ మిగల్లేదని చెప్పారు. ప్రస్తుతం కూడా లిక్కర్ స్కామ్ ముఠానే ఆ పార్టీలో ఉన్నారని విమర్శించారు. పీపీపీ పద్ధతిలో చేపట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైసీపీ దుష్ప్రచారం చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. తాము ఎన్నికల సమయంలో అన్ని ప్రాంతంలో పర్యటించామని, అప్పుడు కనీసం రోడ్లు కూడా లేని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో ప్రతి రోడ్డునూ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. కేవలం రోడ్లు మాత్రమే కాదని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు పీ-4 వంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాల అమలు ద్వారా ప్రజలకు సంతోషంగా ఉన్నారని తెలిపారు. తాజాగా స్మార్ట్ రేషన్ కార్డులు అందించిన నిత్యావసరాల సరుకుల సరఫరాలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన పరిశ్రమలను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ కృషితో తిరిగి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. తాజాగా స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా, కార్పొరేటర్ శంకూరి శ్రీనివాసరావు, క్లస్టర్ ఇంచార్జ్ చెల్లా ఆంజనేయ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
233 1 minute read