
అహింసే ఆయుధంగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహానీయుడు మహాత్మా గాంధీ అని, ఆయన మార్గం అనుసరణీయమని గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. జాతిపిత మహ్మత గాంధీజి 156వ జయంతి సందర్భంగా హిమని సెంటర్ లో ఉన్న మహాత్మా గాంధీజీ విగ్రహానికి డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియాలతో కలిసి మేయర్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలన ద్వారా గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా గాంధీ కలలు కన్నారని గుర్తుచేశారు. గాంధీజి ఆశయ సాధనలో ప్రతిఒక్కరూ దేశం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. లాల్ బహదూర్ శాస్త్రి రైతులకు అందించిన సేవలను గుర్తుచేశారు. సత్యమే దైవమని, సత్యాన్నే ఆయుధంగా ఎంచుకోవాలని గాంధీజీ బోధించారని చెప్పారు. అహింస ద్వారా సాధించలేనిది ఏదీ లేదని, అహింస ద్వారా ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించవచ్చని నిరూపించారని అన్నారు. సత్యం కోసం, న్యాయం కోసం అహింసాత్మక పద్ధతుల్లో నిరసన తెలపడమే సత్యాగ్రహం అని సహాయ నిరాకరణ బ్రిటిష్ పాలనలో అన్యాయాలను ప్రతిఘటించడానికి, వారికి సహాయం చేయడాన్ని నిరాకరించడం ఒక ముఖ్యమైన ఆయుధం అని, సామరస్యం, సమానత్వం గాంధీజీ సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ గాంధీజీ దేశం కోసం చేసిన సేవలను, స్వాతంత్ర పోరాటంలో చేసిన త్యాగాలను స్మరించుకోవలసిన అవసరం ఉందన్నారు. సత్యం, సేవాభావం అనే గొప్ప అంశాలను ప్రపంచానికి అందించారని చెప్పారు. స్వచ్ఛ సమాజాన్ని ఆయన కోరుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ అవార్డులలో జిల్లాకు రాష్ట్రస్థాయిలో 5 అవార్డులు, జిల్లా స్థాయిలో 48 అవార్డులు రావడం గర్వకారణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ హాసన్ భాషా, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసు, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, తదితరులు పాల్గొన్నారు.







