గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో గాలి నాణ్యత ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కాలుష్య నివారణ చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మందిరంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP) ద్వారా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న పనుల పురోగతిపై జరిగిన జిల్లా స్థాయి అమలు కమిటీ (DLIC) సమావేశంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తో కలిసి సమీక్షించారు. ఎన్ సీ ఎ పీ ద్వారా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో కాలుష్య నివారణకు రహదారుల అభివృద్ధి, మొక్కలు నాటే పనులపై జిల్లా కలెక్టర్ సమీక్షించి, అధికారులకు సూచనలు అందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ద్వారా నగరంలో కాలుష్య నియంత్రణకు మంజూరు చేసిన నిధులను సక్రమంగా వినియోగించి గాలి నాణ్యత ప్రమాణాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెడికల్ క్లబ్ రోడ్డు, పొన్నూరు రోడ్డు బీటీ పనులకు, మియా వాకి ప్లాంటేషన్ కు రూ.3.56 కోట్ల తో అందించిన ప్రతిపాదనలకు ప్రాథమికంగా సమావేశంలో ఆమోదించారు. ఈ సమావేశంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నసీనా బేగం, డీఎఫ్ఓ హిమ శైలజ, డిటిసి సీతారామిరెడ్డి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జయలక్ష్మి, నగరపాలక సంస్థ ఇంచార్జ్ ఎస్ఈ సుందరరామిరెడ్డి, సిపిసిబి కన్సల్టెంట్ కోమలి తదితరులు పాల్గొన్నారు.