మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడి వేడిగా జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహ్మద్ నసీర్, బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ ఏసురత్నం, కమీషనర్ పులి శ్రీనివాసులు, ఇతర కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులపై కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అయితే అధికారుల తీరుపై ప్రజా ప్రతినిధులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.నగరపాలక సంస్థ అధికారులు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి వ్యాపారుల నియంత్రణ, ఫుట్ పాత్ లపై ఆక్రమణ తొలగింపు విషయంలో ఏమాత్రం ప్రణాళిక లేకుండా కమిషనర్ వ్యవరిస్తున్నారని నిప్పులు చేరిగారు. గుంటూరులో అనేక పనులు పెండింగ్లో పెట్టిన కాంట్రాక్టర్లకే తిరిగి పనులు అప్పజెప్తున్నారని ఆరోపించారు. అనధికారిక ఎల్.ఈ.డీ బోర్డులు ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు, ఏ విధానంలో అనుమతులు ఇచ్చారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇదిలా ఉంటే శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణ సరైన రీతిలో జరగడం లేదని వైసీపీ కార్పొరేటర్లు తెలిపారు. ప్రణాళిక ప్రకారం పనులు జరగడం లేదని చెప్పారు. ఈ కారణంగా నగరంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పలు కీలక తీర్మానాలు చేశారు.
3,241 1 minute read