
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఈమేరకు మొత్తం 15 బెడ్ లతో వృద్దుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డును జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జాతీయ వృద్దుల దినోత్సవం నాడు ప్రత్యేక వార్డుని ప్రారంభించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఈ వార్డు ఏర్పాటు ద్వారా వృద్ధులకు ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు దోహదపడుతుందని అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలను మరింతగా మెరుగుపరిచి పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







