
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా శనివారం సందర్శించారు. ఆసుపత్రిలో వివిధ వార్డులలో చికిత్స పొందుతున్న వారిని పరిశీలించారు. బీసీ వసతి గృహం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి పర్యవేక్షకులు రమణ తెలియజేశారు. విద్యార్థులకు, అత్యవసర చికిత్సల కోసం వచ్చే ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందించుటకు వైద్యులు సిద్ధంగా ఉండాలని సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని వివిధ విభాగాల్లో మరమ్మతులకు గురైన పరికరాలు ఉంటే వాటిని కూడా ఉపయోగంలోకి తీసుకుని రావాలని అన్నారు. కాగా, అనపర్రు వసతిగృహంలో విద్యార్థులందరూ ఆరోగ్యంగానే ఉన్నారని జిల్లా సాంఘిక, బీసీ సంక్షేమ అధికారి చెన్నయ్య తెలిపారు. జిల్లాలో ఉన్న 33 వసతి గృహాలకు గాను, 24 వసతిగృహాల్లో ఇప్పటికే నీటి నమూనా పరీక్షలు నిర్వహించామని చెప్పారు. మిగిలిన వసతి గృహాల్లో సైతం నీటి నమూనా పరీక్షలు పూర్తి చేస్తామని చెప్పారు. అన్ని వసతి గృహాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అన్ని వసతి గృహాల్లో నీటి తాగునీటి ట్యాంకులను శుభ్రపరచడం జరిగిందని ఆయన వివరించారు. జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, ఇతర అధికారులు అనపర్రు గ్రామాల్లో పరుగు పర్యటించి అచ్చట పారిశుధ్యం, తాగునీటి పరిస్థితులు పరిశీలించారు.







