
గుంటూరు నగరంలో చెత్తను రోడ్ల మీద, కాల్వల పక్కన, ఖాళీ స్థలాల్లో డంప్ చేయవద్దని, అలా వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ నగరంపాలెం, పాత గుంటూరు, కొత్తపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య కార్మికులు తప్పనిసరిగా ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం చేసేలా వార్డ్ ల వారీగా శానిటేషన్ కార్యదర్శులు మరింత శ్రద్ధతో పర్యవేక్షణ చేయాలన్నారు. ఇప్పటికీ నగరంలో పలు ప్రాంతాల్లో చెత్త డంపింగ్ పాయింట్స్ కనిపిస్తున్నాయని, ఆయా ప్రాంతాల్లో చెత్త పడకుండా సేకరణ చేయడం, నిర్లక్ష్యంగా రోడ్ల పై చెత్త వేసే వారిపై అపరాధ రుసుం విధించడం చేయాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వర్షాల వలన ప్రధాన రోడ్ల మీదకు మట్టి, ఇసుక వచ్చిన ప్రాంతాలను శుభ్రం చేయాలని, ప్రధాన రోడ్ల మీద పని చేసే కార్మికులు తప్పనిసరిగా రేడియం జాకెట్స్ ధరించాలన్నారు. వర్షాలకు ఎక్కడైనా చెట్లు పడి ఉంటె వాటిని తొలగించడానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఏడిహెచ్ ని ఆదేశించారు.పర్యటనలో పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
 
 
 
  
 






