గుంటూరు నగరంలో అంతర్గత డ్రైన్ల శుభ్రంపై ప్రజారోగ్య అధికారులు, కార్మికులు దృష్టి సారించాలని, వ్యర్ధాలు డ్రైన్లలో వేసే వారిపై భారీ అపరాధ రుసుం విధించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. మంగళవారం కెవిపి కాలనీ, ఏటుకూరు రోడ్, పొన్నూరు రోడ్, సంగడిగుంట తదితర ప్రాంతాల్లో పర్యటించి, పారిశుధ్య, అభివృద్ధి పనులను తనిఖీ చేసి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డివిజన్ల వారీగా ప్రజారోగ్య కార్మికులు ప్రతి రోజు తమకు కేటాయించిన ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయంలో తప్పనిసరిగా డ్రైన్లను శుభ్రం చేయాలన్నారు. ఇక నుండి మధ్యాహ్నం సమయంలో జరిగే పారిశుధ్య పనులను ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు. అంతర్గత డ్రైన్లలో వ్యర్ధాలు ఉండడం వలన వర్షాలకు మేజర్ డ్రైన్లలోకి చేరి వర్షం నీరు చుట్టుపక్కల ఇళ్లల్లోకి వస్తుందన్నారు. అలాగే డ్రైన్లలో వ్యర్ధాలు వేసే వారిపై భారీ మొత్తం అపరాధ రుసుం విధించాలని స్పష్టం చేశారు. అనంతరం పలు ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న బహుళ అంతస్తు భవనాలను పరిశీలించి, కొలతలను, నిర్దేశిత అనుమతి ప్లాన్ ని తనిఖీ చేశారు. అనుమతి పొందిన ప్లాన్ కి భిన్నంగా నిర్మాణాలు జరిగితే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మంజూరు చేయబోమన్నారు. ప్లానింగ్ కార్యదర్శులు తమ సచివాలయం పరిధిలో అనధికార, అక్రమ నిర్మాణాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యటనలో పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
234 1 minute read