
గుంటూరు నగరంలో త్రాగునీటి సరఫరాపై ఇంజినీరింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా కలుషిత నీటి సరఫరాపై ఫిర్యాదులు అందితే యుద్దప్రాతిపదికన స్పందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ రెడ్ల బజార్, పాత గుంటూరు, కుందుల రోడ్, జేకేసి కాలేజి రోడ్, శ్రీనివాసరావు తోట తదితర ప్రాంతాల్లో పర్యటించి, త్రాగునీటి సరఫరాపై అందిన ఫిర్యాదులను, పారిశుధ్య పనులను, రోడ్ల ఆక్రమణలను, అభివృద్ధి పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాసరావుతోటలో త్రాగునీటి సరఫరాపై అందిన ఫిర్యాదును నేరుగా పరిశీలించి, మాట్లాడుతూ నగరంలో త్రాగునీటి సరఫరా పైప్ లైన్లు ఎక్కడైనా డ్రైన్లలో ఉంటే వాటిని వెంటనే షిఫ్ట్ చేయాలన్నారు. వార్డ్ సచివాలయాల వారీగా ఎమినిటి కార్యదర్శులు తప్పనిసరిగా త్రాగునీటి సరఫరా సమయంలో శ్యాంపిల్స్ తీయాలన్నారు. పైప్ లైన్లకు లీకులు లేదా కలుషిత సరఫరా గుర్తిస్తే తక్షణ చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే సదరు ప్రాంతంలో పారిశుధ్య పనులపై అసంతృప్తి వ్యక్తం చేసి, మెరుగైన పనితీరు ఉండాలని శానిటేషన్ కార్యదర్శి, ఇన్స్పెక్టర్ ని ఆదేశించారు. శ్రీనివాసరావు తోట 60 అడుగుల రోడ్, కుందుల రోడ్ ల్లో ఆక్రమణలను తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు.పర్యటనలో పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.








