
అందరి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా మహా సభలు జయప్రదం అయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు. త్వరలో చండీఘర్ లో జాతీయ స్థాయి మహా సభలు జరగనున్నాయని వారు వెల్లడించారు. దేశవ్యాప్తంగా నెలకొన్న ప్రజా సమస్యలపై జాతీయ మహా సభల్లో సుదీర్ఘంగా చర్చించి పోరాటాలకు రూపకల్పన చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొల్లగొడుతున్నాడని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పారు. ఇందుకోసం ఈనెల 28వ తేదీన ప్రజా కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి అరుణ్ కుమార్, ఏఐవైఎఫ్ నాయకులు వలి, ఏఐఎస్ఎఫ్ నాయకులు చైతన్య పాల్గొన్నారు.








