వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులు తగ్గాలని, రైతులకు లాభదాయకత పెరగాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రాథమిక రంగాల శాఖలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక రంగాల శాఖలు నూతన ఆవిష్కరణలు దిశగా అడుగులు వేస్తూ వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో లాభదాయకత పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాథమిక రంగాల్లో ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మకంగా పరిశీలించాలని సూచించారు. ఏ అంశాన్ని సాధారణంగా తీసుకోరాదని, భవిష్యత్తులో అవసరాలను ముందుగా గుర్తించాలని స్పష్టం చేశారు. శాఖలకు సంబంధించి సమయానుసారం పురోగతి తెలియజేయాలని ఆదేశించారు. పంటల విధానం (క్రాప్ పాటర్న్)మ్యాపింగ్ ను తయారు చేయాలని ఆదేశించారు. ఉత్తమ విధానాలను డాక్యుమెంట్ చేయాలని అన్నారు. స్థూల విలువ ఆధారిత పెంపుకు అవకాశాలు పెంపుదలకు కృషి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అయితా నాగేశ్వర రావు మాట్లాడుతూ వ్యవసాయ శాఖకు 43 సూచికలు ఉన్నాయన్నారు. రైతు సేవా కేంద్రాల స్థాయిలో లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందన్నారు. వ్యవసాయ ఉత్పాదకత, విస్తరణ రంగాల్లో అధిక దృష్టి సారించడం జరిగిందన్నారు. ప్రతి పంట వారిగా ఉన్న సమస్యలను గుర్తించడం జరిగిందని చెప్పారు. ప్రస్తుత ఏడాది శత శాతం లక్ష్యాలు సాధించే దిశగా చర్యలు చేపట్టామని వివరించారు. రైతులు మొక్క జొన్న, మినప పంటలకు మారుతున్నారని చెప్పారు. పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ మాట్లాడుతూ విజన్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా మాంసం, పాలు, గుడ్లు ఉత్పాదకత పెంపుకు దృష్టి సారిస్తున్నామన్నారు. కృత్రిమ గర్భధారణ పద్ధతులను ప్రోత్సహించడం జరుగుతోందని చెప్పారు. పశుదాన పెంపుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి శేష శ్రీ, జిల్లా మత్స్య శాఖ అధికారి పి.ఎన్.కిరణ్ కుమార్, జిల్లా అటవీ అధికారి, జలవనరులు శాఖ పర్యవేక్షక ఇంజనీర్, భూగర్భ జలవనరులు శాఖ, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు, ఏపి ఎం.ఐ.పి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
1,002 1 minute read