
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళనలు మరింత ఉధృతం అవుతున్నాయి. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు, అన్నాబత్తుని శివకుమార్, పార్టీ నేతలు దొంతిరెడ్డి వేమారెడ్డి, డైమండ్ బాబు, అంబటి మురళీ, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాలరెడ్డి, సుధాకర్ బాబు మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గమైన చర్య అని చెప్పారు. పేద వర్గాలకు ఉచిత వైద్యం అందడం చంద్రబాబుకి ఇష్టం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతిగా ఒకేసారి 17 మెడికల్ కళాశాలలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువచ్చారని వారు వెల్లడించారు. ప్రాణాలు పణంగా పెట్టైనా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.







