
మీరే వారదులు అని నియోజక వర్గం స్థాయిలో పనిచేస్తున్న “యంగ్ ప్రొఫెషనల్స్” ను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నియోజక వర్గ ప్రత్యేక అధికారులు, యంగ్ ప్రొఫెషనల్స్ తో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో యంగ్ ప్రొఫెషనల్స్ కీలక పాత్ర వహించాలన్నారు. “ఉన్నత విద్యార్హత కలిగి యంగ్ ప్రొఫెషనల్స్ గా చేరారని, మీ విజ్ఞానం వృథా కాకుండా సమాజ హితానికి దోహదం కావాలని” పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నియోజక వర్గ స్థాయిలో కార్యాలయాలను ముఖ్య మంత్రి ఏర్పాటు చేశారన్నారు. ఈ వ్యవస్థను విజయవంతం చేయడంలో ధృడ సంకల్పంతో పని చేయాలని కోరారు. నియోజక వర్గాల స్థాయిలో విజన్ యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగిందని దానిపట్ల క్షుణ్ణంగా అవగాహన పొందాలని సూచించారు. నియోజక వర్గంలో క్షేత్ర స్థాయిలో ప్రతి అంశం పట్ల సంపూర్ణ అవగాహన అవసరం అన్నారు. మీడియాలో వస్తున్న సానుకూల, వ్యతిరేక వార్తలను కూడా పరిశీలించి వివరాలు తెలుసుకోవాలని తద్వారా అవగాహన పెంపొందుతుందని చెప్పారు. నియోజక వర్గంలో అభివృద్ధికి అవకాశం ఉన్న రంగాలను గుర్తించాలని, వాటి పురోగతికి అవసరమగు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అన్నారు. ప్రాథమిక, సెకండరీ, సేవా రంగాల్లో ఉన్న అన్ని అవకాశాలు ఉపయోగించుకొని నియోజకవర్గం అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాలు (ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్ లు) – ఎన్.టి.ఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) తదితర అంశాలఅమలులో భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. ఆ ప్రాంతాల్లో చేపడుతున్న ప్రాజెక్టులు, ఇతర అంశాల పట్ల స్పష్టమైన అవగాహన పొంది సూచనలు అందించే స్థాయిలో ఉండాలని ప్రేరణ కల్పించారు. నియోజక వర్గాల ప్రత్యేక అధికారులు, శాసన సభ్యులుతో చక్కటి సమన్వయం చేసుకోవాలని తద్వారా ప్రతి అంశానికి మంచి విశ్లేషణ చేయవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి సూచికలు, లక్ష్యాల సాధనలో దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.







