
వైసీపీ ప్రభుత్వం రప్పా రప్పా అంంటుంటే కూటమి ప్రభుత్వం అభివృద్ధి మంత్రం పఠిస్తోందని చేనేత జౌళి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన స్త్రీశక్తి కార్యక్రమాన్ని గుంటూరులో గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, మాజీ మంత్రి రాజకుమారి, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు హాజరయ్యారు. సభకు ఎమ్మెల్యే నసీర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ జగన్ స్త్రీశక్తి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళా సాధికారతకు పెద్ద పీట వేశామని తెలిపారు. తల్లికి వందనం, మెగా డీఎస్సీ, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా రాష్ట్రంలో పేదల సంక్షేమాన్ని లిఖించామని చెప్పారు. ఉల్లి, మిర్చి గురించి జగన్ మాట్లాడుతుంటే రైతులు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉల్లి, మిర్చి రైతుల గురించి చంద్రబాబు నాయుడుకు తెలిసినంత రాష్ట్రంలో మరెవరికీ తెలియదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అందుకే రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేశారని వివరించారు. రాష్ట్రంలో సువర్ణపాలన సాగుతోందని, యువత ఉజ్వల భవితకు దిశానిర్దేశం జరుగుతోందని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు కలలు సాకారం చేశామన్నారు. తల్లికి వందనంతో ప్రతి ఇంటా బిడ్డల చదువులకు భరోసా కల్పించామని తెలిపారు. స్త్రీ శక్తి పథకం ద్వారా బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించి ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నారని అన్నారు. యువనేత, మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ బలపడిందని, దీంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం నారా లోకేశ్ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారని వివరించారు. ఎంఎంఎంఈ ద్వారా మహిళా సంఘాలకు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇది కదా మహిళా లోకానికి నిజమైన సాధికారత అని పేర్కొన్నారు. రాష్ట్రంలో చెప్పిన మాట చెప్పినట్లు అమలు చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. స్త్రీ శక్తి కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ మైనారిటీ ప్రజానీకం అధికంగా ఉన్న గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సూపర్ సిక్స్ పథకాలతో అధిక శాతం మంది లబ్ధి చేకూరిందని అన్నారు. ఐదేళ్లపాటు అభివృద్ధి సంక్షేమంలో వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సహకారంలో అభివృద్ధిలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. తల్లికి వందనం ద్వారా బిడ్డలను పాఠశాలలకు పంపిస్తున్న తల్లుల ఆనందమే స్త్రీశక్తి అని పేర్కొన్నారు. ప్రతి రోజూ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల మోముల్లో కనిపించే ఆనందమే కూటమి ప్రభుత్వానికి ఆశీర్వాదమని స్పష్టం చేశరు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి పేరిట చిన్న పిల్లలను సైతం మోసం చేసిన మేనమామగా జగన్ చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా విమర్శించారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. అభివృద్ధితోపాటు సంక్షేమాన్ని ఒకేతాటిపై నడిపిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీల, కూటమి నేతలు చిట్టాబత్తుని చిట్టిబాబు, జాగర్లమూడి శ్రీనివాసరావు, దాసరి రాజా మాస్టర్, జీ రాఘవేంద్ర, గుడిపల్లి శైలజ, షేక్ గౌస్, పోతురాజు సమత, యల్లావుల అశోక్, ముప్పవరపు భారతి, వేముల జ్యోతిపద్మజ, షేక్ మీరావలి, కన్నా రజని, వేల సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.








