గుంటూరు, అక్టోబర్ 8:గుంటూరు నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా బుధవారం సుదీర్ఘంగా తనిఖీ చేశారు. నగరంలోని కాకుమానుగూడ, బీఆర్ స్టేడియం, పీవీకే నాయుడు పెద మార్కెట్, అంబేద్కర్ భవన్, కృష్ణానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్మాణంలో ఉన్న ఆడిటోరియం, గోరంట్లలో నీటి పథకం, మానస సరోవరం, నల్లపాడు చెరువు, ఐటీసీ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఆమె పర్యటించి సంబంధిత అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని సూచించారు. మానస సరోవరం, నల్లపాడు చెరువులను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పర్యటనలో భాగంగా జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌ను సందర్శించిన కలెక్టర్‌కు, ఆంధ్రా ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్ ఎం.వి. చారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్లాంట్ కార్యకలాపాలను వివరించారు. ఉత్తమ పనితీరుతో ప్లాంట్ నడుస్తోందని, అన్ని విభాగాల్లో సరైన పద్ధతిలో పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
బీఆర్ స్టేడియంలోని వర్షపు నీరు నిలిచిపోవడం, లైటింగ్ సమస్యలపై జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి నర్సింహారెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. స్టేడియంలో మౌలిక సదుపాయాల మెరుగుదల అవసరముందని చెప్పారు.
నల్లపాడు చెరువు వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన లేఅవుట్ వల్ల భారీ వర్షాల సమయంలో రహదారి మునిగిపోతుందని స్థానికులు ఫిర్యాదులు చేశారు. ఈ అంశంపై కలెక్టర్ స్పందిస్తూ పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, సిటీ ప్లానర్ రాంబాబు, జలవనరుల శాఖ ఇంజినీర్ వెంకటరత్నం, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.