గుంటూరు, అక్టోబర్ 6 : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న అన్నక్యాంటీన్లలో ఆహార సరఫరా సమయాలను పర్యవేక్షించేందుకు వార్డ్ సచివాలయ కార్యదర్శులను ప్రత్యేకంగా నియమించినట్లు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు.
సోమవారం అమరావతి రోడ్డులోని అన్నక్యాంటీన్‌ను స్వయంగా సందర్శించిన కమిషనర్, అక్కడ భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం క్యాంటీన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రతి రోజు ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అన్నక్యాంటీన్లలో ఆహారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. మౌలిక వసతులు మెరుగ్గా ఉండాలి. ప్రత్యేకించి త్రాగునీరు, శుభ్రతపై దృష్టి సారించాలి. క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో అలసత్వం సహించం,” అని తెలిపారు.
కేటాయించిన కార్యదర్శులు నిర్దేశిత సమయంలో క్యాంటీన్ వద్ద ఉంటూ, ఏవైనా లోపాలు కనిపిస్తే వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.