
మొంథా తుఫాన్ ను సమర్ధంవంతంగా ఎదుర్కొన్నామని, నగరంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్దంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూసామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. బుధవారం మేయర్, కమిషనర్ లు రామాంజనేయపేట, ఇన్నర్ రింగ్ రోడ్, శ్రీకృష్ణదేవరాయ నగర్, తుఫాన్ నగర్ లను పరిశీలించి, తుఫాన్ ప్రభావంపై ప్రజలను వివరాలు అడిగి తెలుసుకొని, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తుఫాన్ ని ఎదుర్కోవడానికి జిఎంసి ఆధ్వర్యంలో విస్తృత చర్యలు తీసుకున్నామన్నారు. ప్రధానంగా అధికారులు, సచివాలయ కార్యదర్శులు తమకు కేటాయించిన విధుల్లో నూరు శాతం ఉన్నారని, వారికి తోడ్పాటుగా కార్పొరేటర్లు, ఎమ్మేల్యేలు కూడా నిలిచారన్నారు. పునరావాస కేంద్రాల్లో కూడా ఏ లోపం లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించారన్నారు. శివారు ప్రాంతాల అభివృద్ధిపై రానున్న కాలంలో ప్రత్యేక కార్యాచరణ మేరకు కృషి చేస్తామని తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ, తుఫాన్ నేపధ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ముందస్తుగా కచ్చా డ్రైన్ల ఏర్పాటు, మేజర్ డ్రైన్లలో పూడికతీత చేపట్టడం వలన పలు కాలనీలు ముంపు బారిన పడలేదన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు పంపి వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించామన్నారు. తుఫాన్ నగర్ లో ప్రజలను పునరావాస కేంద్రాలకు పంపడంతో పాటు సదరు ప్రాంతంలో నిలిచిన నీటిని మోటార్ల ద్వారా బెయిల్ అవుట్ చేయించామని తెలిపారు. ప్రజలు ఏ సమస్య ఉన్నా జిఎంసి కమాండ్ కంట్రోల్ రూమ్ 0863 2345103 కి సమాచారం ఇవ్వాలని సూచించారు.పర్యటనలో కార్పొరేటర్ బి.స్మిత పద్మజ, డిఈఈ శ్రీనివాస్, నోడల్ అధికారులు, వివిధ డివిజన్ల కార్పోరేటర్లు,అధికాలరు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.







