
నగర స్వచ్ఛతలో ప్రతి పౌరుడి పాత్ర ఎంతో ముఖ్యమని, ప్రతి ఇంటి నుండి వచ్చే వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వేరు చేసి ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. బుధవారం కమిషనర్ రెడ్డిపాలెం, విజయపురి కాలనీ, అన్నపూర్ణ నగర్, హిమని నగర్, టెలికాం నగర్, రెడ్డిపాలెం, అరండల్ పేట ప్రాంతాల్లో పారిశుధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ తొలుత రెడ్డిపాలెంలో స్థానికులతో మాట్లాడుతూ వ్యర్థాలను వేరు చేయడం ద్వారా రీసైక్లింగ్, కంపోస్టింగ్ వంటి పద్ధతులు సులభమవుతాయని, తద్వారా నగరంలో చెత్త నిల్వ సమస్యలు తగ్గుతాయన్నారు. ప్రజారోగ్య కార్మికులు కూడా తమకు కేటాయించిన మైక్రో ప్యాకెట్ల వారీగా అన్ని ఇళ్ల నుండి నూరు శాతం చెత్త సేకరణ చేయాలన్నారు. చెత్త సేకరణ విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని పర్యవేక్షణ మెరుగ్గా చేయాలని శానిటేషన్ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లకు స్పస్టం చేశారు. అనంతరం అరండల్ పేట మెయిన్ రోడ్ లో డ్రైన్ భవన వ్యర్ధాలతో నిండి ఉండడం గమనించి తక్షణం తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులను ఎం.బుక్ మేరకు పరిశీలించి, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పనులు ప్రారంభం నుండి మెరుగైన పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పనులు పూర్తైన వెంటనే నిర్దేశిత విధానంలో ఎం.బుక్ రికార్డ్ చేయాలన్నారు. పర్యటనలో డిఈఈ రమేష్, ఎస్ఎస్ లు ప్రసాద్, ఐజాక్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.







